20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్త ఏదుల శ్రీకాంత్ జీవితానికి చివరికి కేవలం రూ.5 లక్షలే విలువ కట్టారని చెప్పడం ఎంతో బాధాకరం. ఈ విషయాన్ని ప్రతి రాజకీయ పార్టీ కోసం కష్టపడుతున్న యువత గుర్తుంచుకోవాలి.
20, 30 సంవత్సరాల పాటు పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమించినా, చివరకు మీ కుటుంబ పేదరికం పోకపోతే, మీ తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, పెళ్లి వయస్సుకు వచ్చిన చెల్లెలు లేదా కుటుంబ బాధ్యతలు మీ భుజాలపై ఉంటే, అలాంటి సమయంలో మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.
శ్రీకాంత్ కుటుంబాన్ని కల్వకుర్తి వార్తలు తరఫున గట్టిఇప్పలపల్లి గ్రామానికి వెళ్లి పరామర్శించినప్పుడు వారి బాధను ప్రత్యక్షంగా చూశాం. అనారోగ్యంతో ఉన్న తల్లి, పెళ్లి కావాల్సిన చెల్లెలు, కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తిని కోల్పోయిన ఆ ఇంటి పరిస్థితి ఎంతో విషాదకరంగా కనిపించింది.
ఈరోజుల్లో యువత డ్రగ్స్, విలాసాలు అంటూ విమర్శలు చేసే పెద్దలు చాలామంది ఉంటారు. కానీ రాజకీయ పార్టీల కోసం తమ జీవితాలను అంకితం చేస్తున్న పేద కుటుంబాల యువకుల భవిష్యత్తు గురించి మాత్రం ఎవరూ మాట్లాడరు. ఒకవేళ శ్రీకాంత్‌కు జరిగినట్లే మీకు కూడా ఏదైనా జరిగితే, మీ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? అనే ప్రశ్న ప్రతి యువకుడు తనను తాను వేసుకోవాలి.
జీవితంలో పుట్టుక, మరణం సహజమే. కానీ అధికారంలో లేని రోజుల నుంచే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తకు చివరకు దక్కిన గౌరవం, సహాయం ఇదేనా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతోంది.
శ్రీకాంత్ సోదరుడు చెప్పిన మాటలు మరింత బాధించాయి. గతంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్ రెడ్డి గారి కోసం ఎన్నో సంవత్సరాలు శ్రీకాంత్ అంకితభావంతో పనిచేశాడని, జూలై 4న జరిగిన సభకు వేలాది మందిని సమీకరించడంలో కీలక పాత్ర పోషించాడని చెప్పారు. అలాంటి వ్యక్తి మరణించిన తర్వాత కనీసం పరామర్శించకపోవడం, ఫోన్ ద్వారా అయినా కుటుంబాన్ని ఓదార్చకపోవడం తమను తీవ్రంగా కలిచివేసిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవేళ ఇదే ఘటన సమాజంలో అగ్రవర్ణ వర్గాలకు చెందిన కుటుంబంలో జరిగి ఉంటే, రాజకీయ నాయకులు, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున స్పందించి ఉండేవారనే భావన కూడా చాలా మందిలో ఉంది. అయితే శ్రీకాంత్ కుటుంబానికి మాత్రం కేవలం రూ.5 లక్షల సహాయం చేసి బాధ్యత ముగిసినట్లుగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు వాపోయారు.
యువతకు నా విజ్ఞప్తి ఒక్కటే. రాజకీయాల కంటే ముందు మీ కుటుంబం, మీ చదువు, మీ ఉద్యోగం, మీ భవిష్యత్తు ముఖ్యం. మీ తల్లిదండ్రులు, మీ చెల్లెల్లు, మీ కుటుంబ సభ్యుల జీవితాలు మీపై ఆధారపడి ఉంటాయి. అందుకే చదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించి, మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలి. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలి.
ఏదుల శ్రీకాంత్ మరణం ప్రతి యువకుడికి ఒక గుణపాఠంగా నిలవాలి.
– రచన: అజయ్ కౌండిన్య, ఫిలిం డైరెక్టర్
కల్వకుర్తి వార్తలు















