Thursday, August 6, 2026
Google search engine
0
70

విద్యానగర్‌లో రోడ్డుపైనే గోడ నిర్మాణం?.. పట్టించుకోని మున్సిపాలిటీ…

ఆరు నెలలుగా ఫిర్యాదులు.. అయినా పట్టించుకోని అధికారులు!

కల్వకుర్తి: పట్టణంలోని విద్యానగర్‌లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న రహదారి సమస్యపై కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరల్ కాలేజ్ సమీపంలోని ఓ చర్చి వెనుక భాగంలో శ్రీనివాస్ అనే వ్యక్తి కొత్త ఇల్లు నిర్మించుకున్న సమయంలో, ఇంటి ముందుభాగంలో మట్టి పోసి రహదారికి అడ్డంగా గోడ నిర్మించారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.

దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలుమార్లు స్థానిక కౌన్సిలర్ రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లినట్లు కాలనీవాసులు చెబుతున్నారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ సుమారు ఆరు నెలలు గడిచినా సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా ప్రజా పాలన సమావేశంలో ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిష్కారం లభించలేదని వారు అంటున్నారు.

కాలనీవాసులు పలుమార్లు సంబంధిత వ్యక్తితో మాట్లాడడంతో మట్టి, గోడలో కొంత భాగాన్ని తొలగించినప్పటికీ రోడ్డు పూర్తిగా సరిచేయకుండా మధ్యలోనే వదిలివేయడంతో రాకపోకలకు ఇబ్బందులు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ప్రజల ప్రశ్న ఒక్కటే..

ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న విషయం అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎందుకు పరిష్కారం కావడం లేదు?

ఫిర్యాదులు చేసిన తర్వాత కూడా సమస్యను పరిష్కరించడానికి మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు.

ఇక విద్యానగర్‌లో పందుల బెడద, మురుగు కాలువల సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. పలుమార్లు కౌన్సిలర్‌కు సమస్యలు వివరించినా పరిష్కారం కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని పరిశీలించి, వాస్తవ పరిస్థితులను గుర్తించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

విద్యానగర్‌లో రహదారి, మురుగు కాలువలు, పందుల సమస్యలపై మున్సిపల్ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు.

— కల్వకుర్తి వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here