Thursday, August 6, 2026
Google search engine
Home విద్య చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్‌లో విషాదం.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు

చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్‌లో విషాదం.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు

0
83
  • స్కూల్ బస్సు కింద పడి విద్యార్థిని మృతి

  • చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్‌లో విషాదం.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు

చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి యూకేజీ విద్యార్థిని సహస్ర మృతి చెందడంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. కాస్లాబాద్ గ్రామానికి చెందిన కృష్ణయ్య–మనీష దంపతుల కుమార్తె సహస్ర స్థానిక అభ్యాస్ విద్యాపీఠం పాఠశాలలో యూకేజీ చదువుతోంది.

ప్రతిరోజులాగే శుక్రవారం ఉదయం స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లిన సహస్ర, సాయంత్రం ఇంటి వద్ద బస్సు నుంచి దిగింది. అనంతరం బస్సు వెనక్కి తీస్తున్న సమయంలో వెనుక ఉన్న చిన్నారిని డ్రైవర్ గమనించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన సహస్రను వెంటనే షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ విషాద ఘటనతో చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. అమాయక చిన్నారి అకాల మరణం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

డ్రైవర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం

ఈ ప్రమాదానికి స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ గ్రామస్తులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల రవాణాలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు, ప్రతి స్కూల్ బస్సుకు సహాయక సిబ్బందిని తప్పనిసరిగా నియమించాలని కోరారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, డ్రైవర్ నిర్లక్ష్యం, స్కూల్ యాజమాన్యం బాధ్యతలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

ఈ ఘటన మరోసారి స్కూల్ బస్సుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. చిన్నారుల ప్రాణాల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

– కల్వకుర్తి వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here