గ్రామపంచాయతీ – ముకురాల సర్పంచ్ ఎల్లయ్య స్ఫూర్తిదాయకo
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పరిసర ప్రాంతంలోని మారుమూల గ్రామం ముకురాల. ఈ గ్రామానికి చెందిన ముకురాల ఎల్లయ్య ప్రస్తుతం గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు సేవలందిస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం ఆయన పడిన కష్టం, ఎదుర్కొన్న ఇబ్బందులు, సాధించిన విజయాల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో కల్వకుర్తి వార్తలు నిర్వహిస్తున్న “గ్రామపంచాయతీ” ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మా బృందం ఆయనను కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది.
ఒక గ్రామానికి సర్పంచ్‌గా పనిచేయడం ఎంత బాధ్యతతో కూడుకున్నదో, ఎన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. రాజకీయాల్లో ప్రజల విశ్వాసాన్ని సంపాదించడం ఎంత కష్టమో, అంతకంటే ఎక్కువగా ప్రజల మధ్య సేవాభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు.
ఎల్లయ్య గారు మాట్లాడుతూ, గతంలో గ్రామంలోని మాజీ సర్పంచ్‌ల హయాంలో దాదాపు 20 సంవత్సరాల పాటు గ్రామపంచాయతీ కార్మికుడిగా పనిచేసినట్లు తెలిపారు. ఆ సమయంలో గ్రామంలోని రోడ్లు శుభ్రం చేయడం, మురుగు కాల్వలు శుభ్రపరచడం, పారిశుద్ధ్య పనులు నిర్వహించడం, గ్రామ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించడం వంటి ప్రతి పనిని ఎలాంటి చిన్నచూపు లేకుండా బాధ్యతగా నిర్వహించినట్లు చెప్పారు.
“గ్రామం బాగుండాలంటే ముందుగా పరిశుభ్రత అవసరం. గ్రామ సేవే నా ధ్యేయంగా భావించి ఎలాంటి పనినైనా గౌరవంగా చేశాను. ప్రజల నమ్మకం, నా కష్టం నన్ను ఈ రోజు గ్రామ సర్పంచ్ స్థానానికి తీసుకొచ్చాయి” అని ఎల్లయ్య గారు భావోద్వేగంతో చెప్పారు.
ఒకప్పుడు మురికి కాల్వలు శుభ్రం చేసిన వ్యక్తి, నేడు అదే గ్రామానికి ప్రజల ఆశీస్సులతో సర్పంచ్‌గా ఎన్నిక కావడం నిజంగా ఆదర్శప్రాయమైన విషయం. కష్టం, నిజాయితీ, సేవాభావం ఉంటే ఏ స్థాయికైనా ఎదగవచ్చని ఆయన జీవితం నిరూపిస్తోంది.
కల్వకుర్తి వార్తలు నిర్వహిస్తున్న “గ్రామపంచాయతీ” కార్యక్రమానికి ఇది తొలి ఇంటర్వ్యూ. ప్రజల మధ్య సేవ చేస్తున్న సాధారణ వ్యక్తుల అసాధారణ జీవితాలను వెలుగులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. బడుగు, బలహీన వర్గాల గొంతుకగా నిలిచి, వారి కష్టాలు, విజయాలను ప్రజలకు చేరవేయడం మా బాధ్యతగా భావిస్తున్నాము.
ముకురాల సర్పంచ్ ఎల్లయ్య గారి జీవితం నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తి. రాజకీయాల్లోకి రావాలంటే కేవలం పదవుల కోసం కాకుండా, ప్రజాసేవ కోసం కష్టపడాలని ఆయన జీవితం తెలియజేస్తోంది. గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేసే నాయకులే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని ఆయన నిరూపించారు.
రచన: అజయ్ కౌండిన్య, ఎం.ఏ., ఎల్‌ఎల్‌బి.,ఫిలిం డైరెక్టర్
కల్వకుర్తి వార్తలు















