ఏదుల శ్రీకాంత్ అలియాస్ శంకర్ – ఒక కార్యకర్త జీవితం, ఒక ప్రశ్న, ఒక బాధ
ఏదుల శ్రీకాంత్ అలియాస్ శంకర్, గట్టుపల్లి నివాసి. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ కోసం పని చేస్తూ, మాజీ ఎమ్మెల్యే వంశీ గారి అనుచరుడిగా ఎంతో నిబద్ధతతో సేవ చేశాడు.
జులై 4, 2026న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన మహాసభకు గట్టుపల్లి నుంచి వెయ్యి మందికి పైగా కార్యకర్తలను బస్సుల్లో తరలించాడు. తాను ప్రాణంగా ప్రేమించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, తన నాయకుడు ముఖ్యమంత్రి సభా వేదికపైకి రావడం చూసి ఆనందంతో ఒక్కసారిగా ఎగిరి గంతులు వేయగా, అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అక్కడి నుంచి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆధునిక వైద్య సౌకర్యాలు లేకపోవడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. మూడు రోజుల పాటు చికిత్స పొందినప్పటికీ కోమా నుంచి బయటకు రాలేక మరణించాడు. ఎమ్మెల్యే గారు కూడా వెళ్లి పరామర్శించినా, మృత్యువు నుంచి శ్రీకాంత్‌ను కాపాడలేకపోయారు.
శ్రీకాంత్ మరణం తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారి తరఫున, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు.
అయితే నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే వంశీధర్ రెడ్డి గారు వంటి నాయకులు శ్రీకాంత్ లాంటి నిబద్ధత కలిగిన కార్యకర్తను కోల్పోయారని మాత్రమే కాకుండా, ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడే ఆర్థిక సహాయం చేసి ఒక మంచి కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి ఉంటే బతికి ఉండేవాడేమో అనే బాధ నాలో ఉంది. మరణించిన తర్వాత ఇచ్చిన రూ.5 లక్షల కంటే, బతికున్నప్పుడు చేసిన సహాయం మరింత విలువైనదిగా ఉండేదేమో అనిపిస్తుంది.
శ్రీకాంత్ ఒక అగ్రవర్ణ కులానికి చెందిన వ్యక్తి అయి ఉంటే బతికి ఉండేవాడేమో అనే ప్రశ్న కూడా నా మనసులో కలుగుతోంది. ఈ మాటతో నేను కులాల మధ్య చిచ్చు పెట్టాలని కాదు. ఈ వ్యాసాన్ని చదివే వారు కూడా అలా అర్థం చేసుకోవద్దు. శ్రీకాంత్ నాకు వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తి. ఒక మంచి మనిషి, ఒక కార్యకర్త ప్రాణం కోల్పోయాడనే బాధతోనే ఈ మాటలు రాస్తున్నాను.
శ్రీకాంత్ మరణం ఎంతో బాధాకరం. ఇలాంటి మరణాలు మళ్లీ జరగకూడదు. ప్రభుత్వం, సమాజం, నాయకులు ప్రతి కార్యకర్త ప్రాణానికి విలువ ఇవ్వాలి.
ఎలా యువతను తాగుడు, డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉంచాలని ప్రభుత్వం, తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారో, అలాగే రాజకీయ వ్యసనానికి కూడా అతీతంగా ఉండాలని యువత ఆలోచించాలి. ముందుగా ఉద్యోగం, కుటుంబం, పేదరికం నుంచి బయటపడటం, ఇంటి బాధ్యతలు పూర్తి చేయడం, స్వయం కృషితో ఎదగడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాతే రాజకీయాల గురించి ఆలోచించాలి.
మనలాంటి పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువగా గుర్తొచ్చేవి ప్రభుత్వ ఆసుపత్రులే. అదే ఆర్థికంగా బలమైన లేదా అగ్రవర్ణ కుటుంబాలకు చెందిన నాయకులు అయితే కార్పొరేట్ ఆసుపత్రుల్లో అత్యుత్తమ వైద్యం అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సమాజంలో చాలామంది భావిస్తుంటారు. ఈ అసమానతలు తగ్గే విధంగా ప్రతి పౌరుడికి సమానమైన, నాణ్యమైన వైద్యం అందే వ్యవస్థ బలపడాలని నా ఆకాంక్ష.
ఇలాంటి పరిస్థితుల్లో పేదరికంలో ఉన్న యువత, సాధారణ కార్యకర్తలు మాత్రమే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదు. ప్రజల్లో మార్పు రావాలి. యువత తమ జీవితానికి, ఆరోగ్యానికి, కుటుంబ బాధ్యతలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే నా చిన్న కోరిక.
రచన:
అజయ్ కౌండిన్య, ఎం.ఏ., ఎల్.ఎల్.బి., ఫిలిం డైరెక్టర్
కల్వకుర్తి వార్తలు















