Thursday, August 6, 2026
Google search engine
0
32
దండు మైలారం గ్రామంలో గ్రామ కంఠం భూమి పరిరక్షణ పోరాటానికి డా. విశారదన్ మహారాజ్ మద్దతు

రచన: అజయ్ కౌండిన్య
పీజీ డిప్లమో జర్నలిజం | ఎం.ఏ | ఎల్‌.ఎల్‌.బి | ఫిలిం డైరెక్టర్
కల్వకుర్తి వార్తలు

రంగారెడ్డి జిల్లా, ఇబ్రాహీంపట్నం మండలం, దండు మైలారం గ్రామంలో గ్రామ కంఠానికి చెందిన సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ గ్రామస్థులు చేపట్టిన అఖిలపక్ష రిలే నిరాహార దీక్షకు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు డా. విశారదన్ మహారాజ్ సంఘీభావం తెలిపారు.
నేడు (25-07-2026) దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన, గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ కంఠం భూములు ప్రజల సామూహిక ఆస్తులని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆక్రమించకూడదని పేర్కొన్నారు. ఆక్రమణకు గురైన భూమిని వెంటనే ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుని గ్రామ ప్రజలకు తిరిగి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్రామ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న వారందరికీ తన పూర్తి మద్దతు ఉంటుందని డా. విశారదన్ మహారాజ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతియుత, ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాలే సరైన మార్గమని ఆయన సూచించారు. ప్రజల ఆవేదనను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే గుర్తించి న్యాయం చేయాలని కోరారు.
గ్రామస్థుల సంక్షేమం, ప్రభుత్వ భూముల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం నిరంతరం గళం వినిపిస్తున్న నాయకుడిగా డా. విశారదన్ మహారాజ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజల హక్కుల కోసం నిర్భయంగా పోరాడే నాయకత్వం సమాజానికి అవసరమని పలువురు గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.
దండు మైలారం గ్రామ ప్రజల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, గ్రామ కంఠం భూమిని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని దీక్షా శిబిరంలో పాల్గొన్న ప్రజలు విజ్ఞప్తి చేశారు.

కల్వకుర్తి వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here