*భూమి కోల్పోయిన బొజ్జమ్మకు న్యాయం జరగాలి: మోసపోయిన వృద్ధురాలి ఆవేదన!*
:తలకొండపల్లి,
కంటికి రెప్పలా చూసుకుంటారని నమ్మితే.. నట్టేట ముంచారు!వృద్ధాప్యంలో అండగా ఉంటారనుకుంటే..ఆస్తిని కాజేసి అన్యాయం చేశారు! కన్నకూతురు,మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా చెందాలని రాసిచ్చిన గిఫ్ట్ డీడ్ భూమిని, ఓ మనవడి భార్య గుట్టుచప్పుడు కాకుండా తన పేరిట మార్చేసుకున్న ఉదంతం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో వెలుగుచూసింది.బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.నమ్మకమే శాపమైంది!వెల్జాల్ గ్రామానికి చెందిన ఆయిల్ బొజ్జమ్మ, భర్త వెంకటయ్యల పెద్ద కుమార్తె కలమ్మ కొంతకాలం క్రితం అనారోగ్యంతో మరణించింది.ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు (నలుగురు సంతానం) ఉన్నారు. తల్లిలేని ఆ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అలాగే తన చిన్న కుమార్తె నాగమణి, మనవరాళ్లు పద్మ, రజిత, మనవళ్లు శేఖర్, రవిలు వృద్ధాప్యంలో తనను బాగా చూసుకుంటారని బొజ్జమ్మ నమ్మింది. ఆ నమ్మకంతోనే తన పేరుపై ఉన్న సర్వే నంబర్ 54 లోని 8 ఎకరాల పట్టా భూమిని వారందరికీ గిఫ్ట్ డీడ్ ద్వారా రాసిచ్చింది.తెలియకుండా రిజిస్ట్రేషన్..విక్రయాలు!అయితే, బొజ్జమ్మ నమ్మకాన్ని చిన్న మనవడు రవి భార్య సునీత వమ్ము చేసింది.వృద్ధురాలికి తెలియకుండానే ఆ 8 ఎకరాల భూమిని పూర్తిగా తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకుంది.అంతటితో ఆగకుండా అందులో కొంత భూమిని అప్పటికే విక్రయించేసింది.అంతేకాకుండా, పెద్ద మనవడు శేఖర్ పేరుపై ఉండాల్సిన భూమిని కూడా తన పేరిట మార్చుకుని, విక్రయించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని బాధితురాలు ఆరోపించింది.అధికారులు స్పందించి న్యాయం చేయాలి!తన ఆస్తి తన పిల్లలందరికీ సమానంగా దక్కాలనే ఉద్దేశంతోనే ఇచ్చానని, కానీ ఇలా మోసపూరితంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం అన్యాయమని బొజ్జమ్మ కన్నీరుమున్నీరైంది. తన కుమార్తె నాగమణి, మనవరాళ్లు పద్మ, రజితలకు ఈ భూమిలో సమాన హక్కులు, భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేస్తోంది. తన అనుమతి లేకుండా అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్లు, విక్రయాలపై ఉన్నతాధికారులు చట్టపరంగా సమగ్ర విచారణ జరపాలని వేడుకుంటోంది. తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని, తన భూమిని తనకు లేదా తన చట్టబద్ధమైన వారసులకు అప్పగించి న్యాయం చేయాలని అధికారులను కోరుతోంది. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు రైతులు, బొజ్జమ్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.















