కల్వకుర్తి జూన్ 25:
కల్వకుర్తి పట్టణంలోని ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపులు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. నిరుపేద దళిత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా పక్కదారి పట్టింది. నిబంధనలను తుంగలో తొక్కి, అనర్హులైన బడాబాబులకు అధికారులు దొడ్డిదారిన షట్టర్లను కట్టబెట్టడం పట్ల స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిరుపేద దళితులకు దక్కాల్సిన ఈ షాపులను స్థానిక మున్సిపల్ కౌన్సిలర్, ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులతో పాటు.. ఉన్నత చదువులు చదువుతున్న వారికి, మున్సిపాలిటీ సిబ్బంది బంధువులకు సైతం కేటాయించడం విస్మయానికి గురిచేస్తోంది. రాజకీయ అండదండలు, పలుకుబడి ఉన్నవారికే దొడ్డిదారిన పెద్దపీట వేస్తూ.. ఏళ్ల తరబడి ఉపాధి కోసం ఎదురుచూస్తున్న అర్హులైన దళిత అభ్యర్థులకు అధికారులు మొండిచేయి చూపారు.
తమకు జరిగిన ఈ ఘోర అన్యాయాన్ని నిరసిస్తూ అర్హులైన దళిత అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. కల్వకుర్తి పట్టణంలోని ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట వారు రిలే నిరాహార దీక్షలకు దిగారు. నిరసనకారులు దీక్షా శిబిరంలో కూర్చుని ప్లకార్డులు చేతబూని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. “అర్హులైన దళిత యువతకే షట్టర్లు కేటాయించాలి”, “పక్షపాతం వీడాలి – ప్రతిభను గౌరవించాలి”, “రాజకీయ జోక్యం నశించాలి” అంటూ నినాదాలు చేశారు.
తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, అక్రమంగా జరిగిన ఈ కేటాయింపులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి పారదర్శకంగా అర్హులకు మాత్రమే న్యాయం చేయాలని కోరుతున్నారు. అనర్హుల కేటాయింపులు రద్దు చేయని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని దీక్షా శిబిరంలోని దళిత నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.














