- కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మాణం
- ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న అశ్వత్ మరిముత్తు
- రజనీ డాక్టర్‌గా కనిపించనున్నారని సూచిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో వస్తున్న సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు ‘తలైవా 173’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఆపరేషన్ థియేటర్‌లో రజనీకాంత్, చేతిలో సర్జికల్ బ్లేడ్‌తో నిల్చొని ఉండగా… ఆయన కాలు కింద ఒక రౌడీ పడి ఉన్నట్టుగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. దీంతో ఈ సినిమాలో రజనీ డాక్టర్‌గా కనిపించబోతున్నారనే ప్రచారానికి బలం చేకూరింది. టైటిల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ కమల్ హాసన్ ‘ధర్మమే వెల్లుమ్!’ (ధర్మమే గెలుస్తుంది) అని ట్వీట్ చేశారు.
వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌కు మొదట దర్శకుడిగా సుందర్ సిని ప్రకటించారు. కానీ, ఆయన తప్పుకోవడంతో ఆ తర్వాత సిబి చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. అయితే, అనూహ్యంగా ఆయన కూడా ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. ఈ క్రమంలో ‘డ్రాగన్’ ఫేమ్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ, అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీతలు అనిబరివ్ ద్వయం స్టంట్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.



